అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా రేసులో నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే దానికి గల కారణాన్ని తొలిసారిగా ఆయన బహిర్గతం చేశారు. డెమోక్రటిక్ పార్టీతో పాటు దేశాన్ని ఏకతాటిపై నిలపడం కోసమే తాను అధ్యక్ష రేసు నుంచి వైదొలిగానని ఆయన తెలిపారు. తర్వాత తరానికి బాధ్యతలను అప్పగించడమే సరైన మార్గమని భావించినట్లు వెల్లడించారు.
అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించిన తర్వాత బుధవారం ఆయన తొలిసారి ప్రసంగిస్తూ.. పదవుల కంటే ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే ముఖ్యమని రేసు నుంచి తొలిగానని చెప్పారు. అమెరికా రాజకీయాల్లో స్పష్టమైన విభజన కనిపిస్తోందని.. దానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని .. నియంత, నిరంకుశుల కంటే కూడా దేశం గొప్పదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు మరోసారి ఆయన అమెరికా డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సరైన ఛాయిస్ అని, ఆమె సమర్థురాలంటూ ప్రశంసించారు. తాను అధ్యక్ష హోదాలో ఉన్నంత కాలం తన విధిని సమర్థంగా నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు.