ఫిలిప్పీన్స్‌లో కొరియన్ ఎయిర్‌లైన్స్‌కు భారీ ప్రమాదం తప్పింది. కొరియన్ విమానం ల్యాండ్ అవుతుండగా రన్‌వే పైనుంచి దూసుకెళ్లడంతో విమానం ముందుభాగం ధ్వంసమైంది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి హానీ జరగలేదు. కొరియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన కేఈ631 ఎయిర్‌బస్ విమానం 173 మందితో దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నగరం నుంచి ఫిలిప్పీన్స్ వెళ్తోంది.
ఫిలిప్పీన్స్‌లోని సెబూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా.. ప్రతికూల వాతావరణం వల్ల రన్‌వే పైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విమానం ముందుభాగం ధ్వంసమయింది. అయితే విమానంలోని ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, అంతా క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో విమానంలో 162 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు. ప్రమాదం కారణంగా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేశామని తెలిపారు.