పరువునష్టం కేసులో ట్రంప్‌నకు రూ.692 కోట్ల జరిమానా

-

అమెరికా అధ్యక్షుడిగా మరోసారి పోటీ చేసి పీఠంపై కూర్చోవాలని కలలు కంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (77)కు కోర్టు కేసుల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలే కొలరాడో సుప్రీంకోర్టు ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఓ పరువునష్టం కేసులో న్యూయార్క్‌లోని మాన్‌హటన్‌ ఫెడరల్‌ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. అమెరికన్‌ మాజీ కాలమిస్ట్‌ జీన్‌ కరోల్‌ (80) దాఖలు చేసిన పరువునష్టం కేసులో ట్రంప్‌ ఆమెకు 83.3 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.692.4 కోట్లు) అదనంగా చెల్లించాలని ఆదేశించింది.

కొన్నేళ్ల క్రితం తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన ట్రంప్‌ ఇప్పుడు తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ కరోల్‌ ఇటీవల దావా వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన మాన్హటన్ కోర్టు తాజాగా ట్రంప్‌నకు భారీ జరిమానా విధిస్తూ ఆమెకు నష్టపరిహారం కింద 18.3 మిలియన్‌ డాలర్లతోపాటు భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా మరో 65 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. ఇక కోర్టు తీర్పు అనంతరం జీన్ కరోల్.. ‘‘కిందికి పడదోసినపుడు మళ్లీ లేచి నిలబడిన ప్రతి మహిళ సాధించిన గొప్ప విజయమిది. ఆడవాళ్లను అణగదొక్కాలని చూసే ప్రతి తుంటరికి ఇది భారీ ఓటమి’’ అని ఓ ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version