ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడికిపోతోంది. ఇటీవలే ఇజ్రాయెల్ పైకి ఇరాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకు పడ్డ విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ ప్రధాని నెతన్యాహు చెప్పారు. అయితే చెప్పినట్టుగానే ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడికి తెగబడినట్లు సమాచారం.
తాజాగా ఇరాన్‌లోని ఇస్ఫాహాన్ నగరంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించినట్లు అక్కడి స్థానిక వార్తా సంస్థ పేర్కొంది. మరోవైపు ఈరోజు తెల్లవారుజామున 4.30 గంటలకు (స్థానిక కాలమానం) దుబాయ్‌కు చెందిన ఫ్లైదుబాయ్, ఎమిరేట్స్ సంస్థలు తమ విమానాలను దారి మళ్లించాయి. దీనిపై ఆ విమానయాన సంస్థలు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇంకోవైపు ఇరాన్ బలగాలు కూడా ఇస్ఫాహాన్ ప్రాంతంలో కాల్పులు జరిపినట్లు ఆ దేశ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ నివేదించింది. ఇవన్నీ చూస్తే ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేసి ఉంటుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే ఇప్పటి వరకు దీనిపై ఇజ్రాయెల్ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.