అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ తగిలింది. ఊహించని వైపు నుంచి పోటీ ఎదురైంది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున రంగంలోకి దిగాలని భావిస్తున్న ట్రంప్‌ను ఆయన సన్నిహితుడు, మాజీ ఉపాధ్యక్షుడు పెన్స్ సవాల్ చేస్తున్నారు. తాజాగా అధ్యక్ష ఎన్నికల కోసం పెన్స్ తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ట్రంప్‌ను విమర్శిస్తూనే తన ప్రచారాన్ని ప్రారంభించారు. 2021లో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్స్ భవనంపై చేసిన దాడిని తీవ్రంగా విమర్శించారు.
ఐయోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో పెన్స్ మాట్లాడుతూ ‘‘ఎవరైనా రాజ్యాంగం కంటే తాము అధికులమని భావిస్తే.. వారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వకూడదు. అంతేకాదు.. తమను రాజ్యాంగం కన్నా అధికులుగా చూడాలని కోరిన వారిని కూడా మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నుకోకూడదు’’ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వానికి దీంతో పోటీ మొదలైనట్లయింది.
వాస్తవానికి పెన్స్ వ్యాఖ్యలు ట్రంప్ ఏమాత్రం జీర్ణించుకోలేనివిగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ట్రంప్‌ను విమర్శించడానికి పెన్స్ దూరంగా ఉన్నారు.