అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సూడాన్ నుంచి భారతీయులను సురక్షితంగా స్వదేశానికి రప్పించే ఆపరేషన్ కావేరి సజావుగా కొనసాగుతోంది. ఇప్పటికే సూడాన్ నుంచి ఈ ఆపరేషన్‌లో భాగంగా 2400 మంది భారతీయులను కేంద్రం తరలించింది. భారత వాయుసేన, నావికా దళం వీరిని బయటకు తీసుకొచ్చింది. ప్రైవేటు ఎయిర్‌లైన్ ఇండిగో సైతం భారతీయుల తరలింపు ప్రక్రియలో పాల్గొంది.
శుక్రవారం రోజున పలు బ్యాచ్‌లలో అనేక మంది భారతీయులు సూడాన్ నుంచి జెడ్డాకు చేరుకున్నారు. వీరందరినీ భారత్‌కు తరలించనున్నారు. భారతీయులతో పాటు ఇతరులకు సైతం వాయుసేన సహాయం చేసింది. సూడాన్‌లో సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య పోరాటం జరుగుతోంది. పారామిలిటరీని సైన్యంలో కలిపేయాలని సైనిక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఘర్షణకు ఆజ్యం పోసింది. దీంతో సైన్యం, పారామిలిటరీ దళాల అధిపతులు పోరాటానికి దిగారు.
ఈ హింసాత్మక ఘర్షణల్లో వందలాది సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఘర్షణల మధ్య మూడు రోజుల పాటు కాల్పుల విరమణకు ఇరువర్గాలు అంగీకరించారు. ఈ సమయంలోనే భారత్.. సహాయక చర్యలు ప్రారంభించింది. భారతీయులందరినీ వెనక్కి తీసుకెళ్లేందుకు సైన్యాన్ని రంగంలోకి దించింది. విమానాలు, యుద్ధ నౌకలను అక్కడికి పంపించింది.