ఎట్టకేలకు పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 స్థానాలు ఉండగా రిజర్వ్‌డ్ స్థానాలు పోను 265 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఒక స్థానంలో అభ్యర్థి మరణించగా 264 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఈ ఫలితాల్లోమాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పీటీఐ పార్టీ మద్దతుదారులకు అత్యధికంగా 101 స్థానాలు దక్కాయి. ఇమ్రాన్ పార్టీ గుర్తును ఈసీ రద్దు చేయడంతో వీరంతా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు.
మరోవైపు 3 పర్యాయాలు పాకిస్థాన్ను ఏలిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్థాన్ ముస్లీం లీగ్ నవాజ్ పార్టీ 75 స్థానాల్లో గెలిచి పార్లమెంట్‌లో సాంకేతికంగా అతిపెద్ద పార్టీగా పాకిస్థాన్ ముస్లీం లీగ్ నవాజ్ అవతరించింది. మరో మాజీ ప్రధాని దివంగత బేనజీర్ భుట్టో కుమారుడు బిలావాల్ జర్దారీ భుట్టో నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 54 స్థానాలను గెలుచుకుంది. ముత్తాహిదా క్వామీ మూమెంట్ పాకిస్థాన్ పార్టీకి 17, మరో 12 స్థానాల్లో ఇతర చిన్న పార్టీలు విజయం సాధించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 133 సీట్లు అవసరం కాగా.. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. ప్రస్తుత ఫలితాలు చూస్తుంటే పాకిస్థాన్లో హంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. అయితే హంగ్ కోసం ఏయే పార్టీలు పీఎంఎల్ (ఎన్)తో కలిసి వస్తాయో చూడాలి.