ప్రజలకు న్యాయం చేసే నైజం ఆ పార్టీ డీఎన్‌ఏ లోనే లేదు :కిషన్ రెడ్డి

-

కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు కోటలు దాటుతాయి తప్ప.. పనులు వారి ఆఫీసు కూడా దాటవని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యా వ్యవస్థ మెరుగు పరిచేందుకు కావాల్సిన నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధి మోండా మార్కెట్,బేగంపేట్, అమీర్ పేట, రాంగోపాల్ పేట్ డివిజన్‌లో ఎంపీ ల్యాడ్స్‌తో ఏర్పాటు చేసిన పవర్ బోర్లను ఆదివారం కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ …తెలంగాణలో విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ బడ్జెట్‌ను కేటాయించిందని, స్కూళ్లలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు.

 

హాస్టళ్లలో కలుషిత ఆహారం తినడం,నీరు తాగడం వల్ల ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట విద్యార్థులు అస్వస్థతకు గురవుతూనే ఉన్నారని ఆయన అసహనం వ్యక్తంచేశారు. విద్యార్థుల ఆత్మహత్యలు జరగకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి అనేక విషయాల్లో సహకరిస్తున్నా.. కేంద్ర నిధులను గత ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని ఆరోపించారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా మార్పు వస్తుందని తాము అనుకోవడం లేదని ఎద్దేవ చేశారు. హస్తం పార్టీ గత చరిత్ర అవినీతి చుట్టూ, కుటుంబాల చుట్టే ఉన్నది తప్పా.. ప్రజలకు న్యాయం చేసే నైజం ఆ పార్టీ డీఎన్ఏలోనే లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మాటల గారడి తప్ప బడ్జెట్లో పేదలకు జరిగిన మేలు ఏమీ లేదని ఆయన విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version