పాకిస్తాన్ లో రాజకీయం ఎన్నో మలుపులు తిరిగింది. చివరకు పాక్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కుప్పకూలింది. పాక్ సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు శనివారం సమావేశం అయిన జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మాణాన్ని ఎదుర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేఖంగా 174 ఓట్లు రావడంతో పాక్ లో ఇమ్రాన్ శకం ముగిసింది. తనపై అమెరికా కుట్ర చేసిందని ఇమ్రాన్ ఖాన్ తో పాటు పీటీఐ పార్టీ ఆరోపిస్తోంది.
ఇదిలా ఉంటే పాక్ కొత్త ప్రధానిగా ముస్లిం లీగ్ పార్టీ నాయకుడు షహబాజ్ షరీఫ్ ఎన్నిక కానున్నారు. సోమవారం కొత్త ప్రధానిగా పాక్ జాతీయ అసెంబ్లీ షహబాజ్ షరీఫ్ ను ఎన్నుకోనుంది. పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాసం నెగ్గిన తర్వాత ఆయన పాక్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఇమ్రాన్ ఖాన్ పై ఎలాంటి కక్ష సాధింపులు ఉండవని వ్యాఖ్యానించారు. ఎవరిని జైల్లో పెట్టబోం అంటూ.. చట్టం తన పని చేసుకుంటూ పోతుందని వ్యాఖ్యానించాడు. కోట్లాది మంది పాకిస్తాన్ ప్రజల ప్రార్థనలను దేవుడు అంగీకరించాడంటూ షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించాడు.