పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ రద్దు అయింది. ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేయాలనే ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ సలహా మేరకు ఆ దేశ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించారు. ఈ నిర్ణయంతో పాకిస్థాన్ పార్లమెంట్ దిగువసభతో పాటు ముస్లిం లీగ్- నవాజ్(పీఎంఎల్-ఎన్)నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మూడు రోజుల ముందస్తుగానే రద్దైంది. ఇక త్వరలోనే ఆ దేశానికి ఎన్నికలు జరగనున్నాయి.
బుధవారం రోజున పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రధానిగా షహ్‌బాజ్ షరీఫ్ చివరి ప్రసంగం చేశారు. సభ అనుమతితో జాతీయ అసెంబ్లీ రద్దు చేయాలని అధ్యక్షుడికి చెప్పాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక గడువు కంటే మూడు రోజుల ముందే జాతీయ అసెంబ్లీ రద్దవడంతో ఎన్నికల సంఘం 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. పాక్‌లో కొత్త జనాభా గణన ఫలితాలు రావడంతో ఎన్నికలకు ముందే నియోజక వర్గాల విభజన చేయాల్సి ఉంది. 120 రోజుల్లో డీలిమిటేషన్ నిర్వహించి ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని ఎన్నికల సంఘం భావించింది.