తెలంగాణ సర్కార్ కొత్తగా ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మి’ పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. సొంత స్థలం ఉండి, ఇప్పటివరకు ఆర్‌సీసీ స్లాబ్ ఇల్లు లేని పేదలు ఈ పథకం కింద ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్న సంగతి తెలిసిందే. తొలిదశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వేల ఇళ్ల చొప్పున మంజూరు చేయాలని సర్కారు నిర్ణయించింది. గృహలక్ష్మి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు క్షేత్రస్థాయిలో ప్రచారం జరగటంతో ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాల వద్ద వరుస కట్టారు. దీనికి అధికారికంగా తుది గడువు ప్రకటించకపోయినా.. తొలిదశలో గురువారం (ఈ నెల 10వ తేదీ) వరకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలన చేయించేందుకు అధికారుల బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.
గత మూడు రోజులుగా గృహలక్ష్మి దరఖాస్తులు వేల సంఖ్యలో వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. నియోజకవర్గాల వారీగా ఇంకా లెక్కగట్టకపోయినా.. మంజూరు చేసే ఇళ్లకు మించి దరఖాస్తులు వచ్చాయని అంటున్నారు. ఇవాళ కూడా దరఖాస్తులు స్వీకరించాలని ఉన్నతాధికారుల నుంచి సమాచారం వచ్చినట్లు వివరించారు. శనివారం నాటికి దరఖాస్తుల సంఖ్యపై స్పష్టత రావచ్చని సమాచారం.