పాకిస్థాన్ లో తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఇమ్రాన్ ఖాన్ ఇక గద్దె దిగే సమయం ఆసన్నం అయింది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేఖంగా ప్రతిపక్షాలన్నీ ఏకం అయ్యాయి. ఇన్నాళ్లు ఇమ్రాన్ ఖాన్ కు మద్దతు ఇస్తున్న పార్టీలన్నీ కూడా ప్రతిపక్షాల పంచన చేరాయి. దీంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఇప్పటికే పాక్ జాతీయ అసెంబ్లీలో నేడు అవిశ్వాసంపై చర్చించనున్నారు. మొత్తం 342 మంది సభ్యుల్లో ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే 172 మంది మద్దతు కావాలి కానీ… ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ కు 164 మంది మద్దతు మాత్రమే ఉంది. దీంతో ప్రభుత్వం దాదాపుగా కూలిపోవడం ఖాయం అయింది.
ఇదిలా ఉంటే నిన్న వరసగా ఇమ్రాన్ ఖాన్ తన మంత్రి వర్గంతో పాటు ఆర్మీచీఫ్ కమల్ జావేజ్ బజ్వా, ఐఎస్ఐ చీఫ్ తో సమావేశం అయ్యారు. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే సైన్యం మద్దతు కూడా కోల్పోయాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇమ్రాన్ అనుకూల మంత్రులు మాత్రం… చివరి బంతి వరకు ఇమ్రాన్ పోరాడుతారని.. ఓటింగ్ రోజు మిత్రులెవరు, శత్రువలెరో తెలుస్తుందని అంటున్నారు. మరోవైపు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో ఇమ్రాన్ ఖాన్ కు సవాల్ విసిరారు. ఇప్పటికే ఇమ్రాన్ మద్దతు కోల్పోయాడని… పాక్ కు కాబోయే ప్రధాని షాబాజ్ షరీఫ్ అంటూ వ్యాఖ్యానించారు.