అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వాషింగ్టన్కు చేరుకున్నారు. మోదీకి వైట్‌హౌస్‌లో బైడెన్ దంపతులు ఘనస్వాగతం పలికారు. పురాతన అమెరికన్ బుక్ గ్యాలీతో పాటు పాతకాలపు అమెరికన్ కెమెరాను మోదీకి బైడెన్ బహూకరించారు. అనంతరం ఇరువురూ భేటీ అయి పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. వైట్‌హౌస్‌లో ప్రవేశించే ముందు బైడెన్ దంపతులు, మోదీ ఫొటోలకు పోజులిచ్చారు. ప్రధాని మోదీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా కూడా వైట్‌హౌస్‌లోకి వెళ్లారు. అనంతరం బైడెన్ దంపతులు ఇచ్చిన విందులో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
అంతకుముందు అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఆమెకు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని ప్రధాని మోదీ కానుకగా ఇచ్చారు. ఈ సందర్భంగా అమెరికా-భారత్ బంధంపై జిల్ బైడెన్ మీడియాతో మాట్లాడారు. యూఎస్-భారత్ భాగస్వామ్యం ప్రపంచ దేశాల సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. ప్రధాని మోదీ పర్యటనతో ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యాలు ఒక చోటికి తీసుకొచ్చినట్లు ఉందని పేర్కొన్నారు.