అమెరికాలో ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెలుగమ్మాయి జాహ్నవిని ఉద్దేశించి అక్కడి పోలీసు అధికారి చులకనగా మాట్లాడిన ఆడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం పెను దుమారం రేపింది. ఈ ఘటనలో పోలీసు అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా సియాటిల్ నగర పోలీసు అధికారిపై వేటు పడింది.
అతడిపై చర్యలు తీసుకోవాలంటూ భారత్ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తిన నేపథ్యంలో అమెరికా అధికారులు అతడిని విధుల్లో నుంచి తొలగించారు. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న డేనియెల్ ఆడెరర్ను.. ఆ విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు సియాటిల్ పోలీసు శాఖ తాజాగా ప్రకటించింది. ప్రస్తుతానికి నాన్-ఆపరేషనల్ పొజిషన్ (సస్పెన్షన్ లాంటిది)లో ఉంచినట్లు తెలిపింది.
ఇటీవల డేనియల్ బాడీకామ్లో రికార్డైన దృశ్యాలను సియాటిల్ పోలీసు శాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. జాహ్నవి మరణంపై మాట్లాడుతూ అతడు పగలబడి నవ్వడం అందులో రికార్డైంది. చనిపోయిన యువతి ప్రాణం విలువైనది కాదని డేనియల్ చెప్పడం సంచలనమైంది. దీనిపై భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.