అట్లాంటిక్ మహా సముద్రంలో మూడు బోట్లు కనిపించకుండా పోయాయి. ఆఫ్రికాలోని సెనెగల్ నుంచి స్పెయిన్‌కు చెందిన కానరీ దీవులకు బయల్దేరిన ఈ బోట్లలో 300 మందికిపైగా వలసదారులు ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్పెయిన్ అధికారులు.. కానరీ దీవుల సమీపంలో గాలింపు షురూ చేశారు.
పశ్చిమ ఆఫ్రికా నుంచి కానరీ దీవుల ప్రయాణ మార్గం అత్యంత ప్రమాదకరమైనదని నివేదికలు చెబుతున్నాయి. అట్లాంటిక్ భీకర అలల ధాటికి చిన్నచిన్న పడవల వంటివి నిలవడం కష్టమని తెలిపాయి. స్థానికంగా ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, హింస, రాజకీయ అస్థిరత, వాతావరణ మార్పుల వంటి అనేక అంశాలు వలసదారులను తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశం దాటేందుకు కారణమవుతున్నాయని నిపుణులు అంటున్నారు.
తాజా ఘటనలో 200 మందికిపైగా వలసదారులతో ఒక పడవ, 100 మందికిపైగా పౌరులతో మరో రెండు బోట్లు దాదాపు రెండు వారాల క్రితం కానరీ దీవులకు బయల్దేరాయని వలసదారుల హక్కుల సంస్థలు తెలిపాయి. మార్గమధ్యలో అవి తప్పిపోయాయని.. వలసదారుల్లో చాలామంది మహిళలు, చిన్నారులు ఉన్నారని చెప్పాయి. స్పెయిన్, సెనెగల్ అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అని డిమాండ్ చేస్తున్నాయి.