ఫ్రాన్స్‌తో రూ.90 వేల కోట్ల డీల్ కుదుర్చుకునే ప్రయత్నంలో ఉంది భారత్. భారత నౌకాదళం కోసం 26 అత్యాధునిక రఫేల్ యుద్ధవిమానాలతో పాటు మూడు స్కార్పెన్ తరగతికి చెందిన జలాంతర్గాముల కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నెల 13, 14 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఇందుకు సంబంధించిన ఒప్పంద ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. వీటికి సంబంధించి రక్షణ బలగాలు ఇప్పటికే మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.
ఈ కొనుగోలు ప్రతిపాదనలపై ఇప్పటికే రక్షణశాఖ ఉన్నతాధికారులు చర్చించారని, త్వరలోనే రక్షణ పరికరాల కొనుగోలు మండలి ఆమోదం తెలుపుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం ఒకే సీటు కలిగిన 22 రఫేల్ మెరైన్ విమానాలు భారత నౌకాదళానికి అందుతాయి. దీంతో పాటు నాలుగు శిక్షణా విమానాలు అందుతాయి. ఒప్పందం విలువ రూ.90 వేల కోట్లుగా ఉండవచ్చని అంచనా. అయితే, కచ్చితమైన విలువ మాత్రం ఒప్పందం ఖరారైన తర్వాతే తెలిసే అవకాశం ఉంది.