యూకేకు వెళ్లిన.. వెళ్లాలనుకుంటున్న వారికి బ్యాడ్ న్యూస్. ఈ అక్టోబర్ నుంచి ఆ దేశ వీసా ఫీజులు పెరగబోతున్నాయి. విదేశీయులకు తమ దేశ వీసా ఫీజుల పెంపు అక్టోబర్ 4 నుంచి అమల్లోకి వస్తుందని బ్రిటన్ తాజాగా ప్రకటించింది. ఆరు నెలలు, అంతకంటే తక్కువ వ్యవధిగల పర్యాటక వీసాలపై ఇక నుంచి 15 జీబీపీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు విద్యార్థి వీసాల ఫీజు అదనంగా 127 జీబీపీలు పెరగనుంది. దీనికి ఇంకా పార్లమెంట్ ఆమోదం లభించాల్సి ఉన్నా.. ఆ ప్రక్రియ లాంఛనమే. భారత్ సహా ప్రపంచ దేశాల పౌరులకు ఇకపై బ్రిటన్‌కు వెళ్లడం భారంగా మారనుంది.
దేశంలో ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు వేతనాల పెంపు కారణంగా పడే భారాన్ని దీని ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించినట్లు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చెప్పారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చే డబ్బును వేతనాలకు ఖర్చు చేయడం తనకు ఇష్టం లేదని, అందుకే వీసా ఫీజులను, ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌ఛార్జిని పెంచాలని నిర్ణయించామని సునాక్ తెలిపారు. ఈ పెంపుతో బ్రిటన్ ఖాజానాకు బిలియన్ జీబీపీల ఆదాయం సమకూరే అవకాశం ఉందని అంచనా.