హమాస్ మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఓవైపు వైమానిక దాడులు.. మరోవైపు భూతల దాడులతో విరుచుకుపడుతోంది. అయితే ఈ యుద్ధంలో సామాన్య పౌరులు.. చిన్నారులే ఎక్కువగా మరణిస్తున్నారు. దీనిపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ల మధ్య సయోధ్య ఒప్పందం ఒక్కటే గాజా ప్రజల ప్రాణాలు కాపాడటానికి సరిపోదని ఐక్య రాజ్య సమితి చిల్డ్రన్స్ ఫండ్ (యూనిసెఫ్) అభిప్రాయపడింది.
గాజాలో ఇప్పటి వరకు 5,300 మంది చిన్నారులు మృతి చెందారని యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరిన్ రస్సెల్ తెలిపారు. మరో 1,200 మంది చిన్నారులు ఇంకా శిథిలాల కింద ఉండొచ్చని అన్నారు. ఇప్పటివరకు ఎప్పుడూ జరగని దారుణ మారణహోమం గాజాలో జరిగిందని.. తాజాగా గాజాలో పర్యటించిన కేథరని అన్నారు. అక్కడ తాను చూసిన దృశ్యాలు.. విన్న వార్తలు ఇంకా తనను వెంటాడుతున్నాయని తెలిపారు.
ఈ మారణహోమాన్ని ఆపడానికి వెంటనే పూర్తిగా కాల్పులు విరమించాలని ఆమె కోరారు. గాజా చిన్నారులు ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గాజా చిన్నారులకు అనువైన ప్రాంతం కాదని.. అది అత్యంత ప్రమాదకరమైన ప్రదేశమని అభిప్రాయపడ్డారు.