రష్యాను ఒక్కరోజు గడగడలాడించింది వాగ్నర్ గ్రూప్. ఆ గ్రూప్ అధిపతి ఏకంగా పుతిన్‌పైనే యుద్ధం ప్రకటించారు. ఉక్రెయిన్‌లో రష్యాకు సాయమందిస్తూ యుద్ధం చేస్తున్న వాగ్నర్ సేన ఒక్కసారిగా రూట్ మార్చి పుతిన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగరవేసింది. అంతే వేగంగా వెనక్కి తగ్గి.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అయితే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వాగ్నర్ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్ ఓ వీడియో రిలీజ్ చేశారు.
రష్యాపై తాము చేసిన తిరుగుబాటు.. పుతిన్ సర్కారును పడదోయడానికి కాదని ప్రిగోజిన్ స్పష్టంచేశారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర ఎలా కొనసాగాలో చెప్పి, నిరసన వ్యక్తం చేయడమే తమ ఉద్దేశమని చెప్పారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని అసమర్థ రీతిలో రష్యా కొనసాగిస్తోందనీ, దానిపై నిరసనగానే మాస్కోకు బయల్దేరామని తాజా సందేశంలో ఆయన తెలిపారు. చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయడం లక్ష్యం కాదన్నారు. సాయుధ వాహనశ్రేణితో మాస్కోకు 200 కి.మీ. దూరం వరకు చేరుకోవడమే తమ సత్తాకు నిదర్శనమన్నారు. వాగ్నర్‌కు చెందిన 30 మందిని రష్యా సైన్యం హతమార్చడం వల్లనే న్యాయం కోసం తాము కదం తొక్కాల్సి వచ్చిందని వివరించారు.