అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయానికి చుట్టూ ఉన్న ఏడు పురాతన శ్రీ వెంకటేశ్వర ఆలయాలలో ఒకటి అప్పలాయగుంట లో వెలసినది. ఈ ఆలయంలో ఉన్న వేంకటేశ్వరుడు ఆకాశ రాజు కుమార్తె పద్మావతి ని వివాహం చేసుకుని కాలి నడకన తిరుమలకి బయలుదేరి వెళ్తూ అప్పలాయగుంట లో తపస్సు చేసుకుంటున్న సిద్దేశ్వర స్వామిని అభయ హస్తంతో ఆశీర్వదించి ఈ ఆలయంలో కొలువు తీరాడు అని స్థల పురాణం.
ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో అప్పలయ్య అనే వ్యక్తి అవసరం కొరకు ఒక గుంత తవ్వించాడని అందుకే ఇది అప్పలాయగుంట గా మారిందని స్థానిక కథనం. అంతేకాక ఈ గుంత తవ్విన పనివారికి అప్పు ఉంచకుండా ఏ రోజు డబ్బు ఆ రోజే ఇచ్చే వాడని అందుకే ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందని మరో కథ ప్రచారంలో ఉంది. అప్పలాయగుంట తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి దక్షిణం వైపున ఎత్తైన కొండ, చుట్టూ పంట పొలాలతో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజ స్తంభం, దాని వెనుక అంతరాళం ఎదురుగా శ్రీవారి దివ్య మంగళ రూపం కనుల విందు చేస్తుంది.
శ్రీ వారి ఆలయానికి ముందు చిన్న కోనేరు ఉంది. దానికి ముందు ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రతి రోజు ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి వారికి పూజ, అభిషేకాలు నిర్వహించిన తరువాత వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు, పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలుగచేస్తారు. ఈ ఆలయం ప్రశాంత వాతావరణంలో ఉన్నందున భక్తులు సావధానంగా చిత్తశుద్దితో దైవ దర్శనం చేసుకోవచ్చు.