పోస్టాఫీసుల్లో మనకు ఎన్నో రకాల పొదుపు స్కీంలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) స్కీం కూడా ఒకటి. ఇందులో పొదుపు చేసుకునే డబ్బుకు పూర్తి రక్షణ ఉంటుంది. ఎలాంటి రిస్క్ ఉండదు. అందువల్ల ఈ స్కీంలో డబ్బును చాలా సులభంగా ఎలాంటి రిస్క్ లేకుండా పొదుపు చేసుకోవచ్చు.
పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీంను ఎంత చిన్న మొత్తంతో అయినా ప్రారంభించవచ్చు. గరిష్ట లిమిట్ అంటూ ఏమీ లేదు. కేవలం రూ.100తో ఖాతా తెరవచ్చు. ఈ స్కీంలో కనీసం 5 ఏళ్ల పాటు డబ్బును పొదుపు చేయాల్సి ఉంటుంది. అంతకన్నా తక్కువ కాల పరిమితి లేదు. అయితే 5 ఏళ్ల తరువాత కావాలనుకుంటే మరో 5 ఏళ్లకు స్కీంను పొడిగించుకోవచ్చు. కానీ 5 ఏళ్లకు ఒకసారి మాత్రం పెట్టిన మొత్తానికి మెచూరిటీ వస్తుంది.
పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీంలో పెట్టే డబ్బుకు ఏడాదికి 5.8 శాతం వడ్డీ చెల్లిస్తారు. ఈ కొత్త రేట్ ఈ ఏడాది జూలై నుంచి అమలులోకి వచ్చింది. ఇక ఈ స్కీంలో నెలకు రూ.10వేలు పొదుపు చేసుకుంటే 10 ఏళ్లకు ఏకంగా రూ.16.28 లక్షలు పొందవచ్చు. అయితే ఈ స్కీంలో నెల నెలా నిర్దిష్ట మొత్తాన్ని కచ్చితంగా పొదుపు చేయాలి. నిర్దిష్టమైన గడువులోగా నెల నెలా డబ్బు కట్టాల్సి ఉంటుంది. లేదంటే ఫైన్ విధిస్తారు. రూ.100కు రూ.1 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ స్కీంలో 4 నెలలు వరుసగా డబ్బు కట్టకపోతే అకౌంట్ క్లోజ్ అవుతుంది. అయితే జరిమానా చెల్లించి మళ్లీ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. పోస్టాఫీస్ ఆర్‌డీ అకౌంట్‌ను సింగిల్‌గా లేదా జాయింట్ గా ఆపరేట్ చేయవచ్చు. ఒక జాయింట్ అకౌంట్‌కు గరిష్టంగా ముగ్గురు సభ్యులు ఉండవచ్చు. 10 ఏళ్లకు పైబడిన పిల్లలకు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధ్వర్యంలో ఈ అకౌంట్ తెరవచ్చు. ఇక అకౌంట్ తెరిచాక ఏడాదికి మొత్తం సొమ్ములో 50 శాతం వరకు లోన్ తీసుకునే సౌకర్యం కల్పిస్తారు. అలాగే 3 ఏళ్లకు ప్రిమేచర్ క్లోజర్ సదుపాయం లభిస్తుంది. ఇక ఆన్‌లైన్‌లోనూ ఐపీపీబీ సేవింగ్స్ అకౌంట్ ద్వారా ఈ స్కీంలో డబ్బులు పొదుపు చేసుకోవచ్చు.