విపక్షం లేకుండా అంతా అధికారపక్షమే ఉంటే.. ఆ మజాయే వేరు. కానీ.. కర్నూలు జిల్లాలో అంతా రివర్స్. ఎంపీ అంటే ఎమ్మెల్యేలకు పడదు. వారు పిలవరు.. వీరు వెళ్లరు అన్నట్టు ఉందట.2019 ఎన్నికల్లో టీడీపీని చావుదెబ్బకొట్టి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంది వైసీపీ. ప్రస్తుతం ఈ జిల్లాలో టీడీపీకి ఉన్నది ఇద్దరు ఎమ్మెల్సీలే. వార్ వన్‌సైడ్ అవడటంతో జిల్లాలో వైసీపీ నేతలదే హవా. అలా ఉంటే బాగోదని అనుకున్నరో ఏమో.. విపక్ష పాత్రను కూడా వైసీపీవారే పోషిస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు.
ఎంపీలకు, ఎమ్మెల్యేలకు అస్సలు పడటం లేదని వైసీపీలోనే చర్చించుకుంటున్నారు. గెలిచిన కొత్తలో ఉత్సాహంగా కనిపించినా.. కలిసి మెలిసి తిరిగినా.. ఇప్పుడు నువ్వా గట్టునా..నేనీ గట్టున అన్నట్టు చాలా గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు నాయకులు. వైసీపీ ప్రజా ప్రతినిధులు మధ్య పెరుగుతున్న ఈ దూరంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎంపీలు వెళ్లడం లేదా.. ఎమ్మెల్యేలు ఎంపీలను రానివ్వడం లేదా అన్న ప్రచారం జోరందుకుంటోంది. అలాగని ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య తీవ్ర విభేదాలు ఉన్న సందర్భాలూ లేవు.
కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్‌తో ఈ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, ఎంపీ సంజీవ్ కలిసి తిరుగుతారు కానీ.. మిగతా ఎమ్మెల్యేలు ఎంపీతో ఎంత దూరం ఉంటే అంత బెటర్ అన్నట్టు ఉంటున్నారట. ఆదోని ఎమ్మెల్యే ప్రసాద్‌రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే నాగిరెడ్డిలతో ఎంపీ సంజీవ్‌కు ఎన్నికల సమయంలో విభేదాలు తలెత్తాయి. ఏడాదిన్నర అయినా ఆ గొడవలు అలాగే ఉన్నాయట.
నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డితో ఎమ్మెల్యేలకు విభేదాలు ఉన్నట్టు లేదు. కానీ.. ఎమ్మెల్యేలు ఎవరూ ఎంపీ దగ్గరకు రారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిశోర్‌రెడ్డి ఒక్కరే ఎంపీ పోచతో కలిసి తిరుగుతారు. నంద్యాల దాటి లోక్‌సభ పరిధిలోని ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలకు పోచ వెళ్లరు. దీనిపైనా వైసీపీలో రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఎంపీలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించడం ఎమ్మెల్యేలకు ఇష్టం లేదా.. లేక వెళ్లేందుకు ఎంపీలకు ఆసక్తి లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయట.