కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 29వ తేదీ నుంచి జరగాల్సిన ఐపీఎల్ ఏప్రిల్ 15వ తేదీ వరకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాతైనా ఐపీఎల్ జరుగుతుందా, విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా, ఉంటే వారు ఇక్కడికి వచ్చేందుకు అనుమతినిస్తారా..? అన్నది సందేహంగా మారింది. దీంతో అసలు ఈ సారి ఐపీఎల్ జరుగుతుందా, లేదా అని అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈసారి వేసవిలో కాకుండా జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య ఐపీఎల్‌ను నిర్వహిస్తారని ప్రచారం సాగుతోంది.
ఐపీఎల్‌ను ఈ సారి వేసవిలో నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో వచ్చే జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య ఆ టోర్నీని నిర్వహిస్తే ఎలా ఉంటుంది..? అని ప్రస్తుతం బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే అది జరగాలంటే.. విదేశీ ఆటగాళ్లు ఆ సమయంలో ఆ టోర్నీకి అందుబాటులో ఉండాలి. కాగా మే నెలలో ఇతర దేశాలకు వేరే ఏమీ టూర్లు లేవు. ఇక జూన్ నెలలో వెస్టిండీస్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ స్కాట్‌లాండ్ ఐర్లాండ్ టూర్లు ఉన్నాయి. అలాగే జూలైలో ఆస్ట్రేలియా ఇంగ్లండ్, పాకిస్థాన్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ వెస్టిండీస్, సౌతాఫ్రికా వెస్టిండీస్ టూర్ మ్యాచ్‌లు ఉన్నాయి. దీంతో ఆయా దేశాలకు చెందిన కీలక ఆటగాళ్లు జూన్, జూలై నెలల్లో ఐపీఎల్‌కు అందుబాటులో ఉండరు. ఇక ఆగస్టు ఒక్క నెల మాత్రమే ఖాళీగా ఉంటుంది. అదే సెప్టెంబర్ వస్తే ఆసియా కప్‌తోపాటు ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఆ నెలలో మరొక టూర్ ఉంది. దీంతో సెప్టెంబర్‌లో కొన్ని రోజులు ఐపీఎల్ నిర్వహణకు సాధ్యమవుతాయి. ఆ తరువాత అక్టోబర్‌లో టీ20 మెన్స్ వరల్డ్ కప్ ఉంటుంది. ఈ క్రమంలో ఆగస్టుతోపాటు సెప్టెంబర్ నెలలో కొన్ని రోజులు మొత్తం కలిపి దాదాపుగా 40 రోజుల్లో ఐపీఎల్‌ను ముగించేయాలని చూస్తున్నట్లు సమాచారం.
ఇక 2009లో భారత్‌లో ఎన్నికల కారణంగా ఐపీఎల్‌ను సౌతాఫ్రికాలో 37 రోజుల పాటు నిర్వహించారు. దీంతో పరిస్థితులు అనుకూలిస్తే ఈసారి కూడా అలాంటి షెడ్యూల్‌లోనే ఐపీఎల్‌ను నిర్వహించాలని చూస్తున్నట్లు తెలిసింది. అయితే జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య భారత్‌లో పూర్తిగా వర్షాకాలం ఉంటుంది కనుక చాలా వరకు మ్యాచ్‌లకు వర్షం అడ్డంకిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈ సారి ఐపీఎల్ ఇక విదేశాల్లోనే జరగవచ్చని తెలుస్తోంది. అయితే ఏప్రిల్ 15వ తేదీ వస్తేనే గానీ.. ఐపీఎల్ టోర్నీ జరిగే తేదీలపై స్పష్టత రాదు. ఇక అప్పటి వరకు వేచి చూడాల్సిందే..!