హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు ఇది పండుగ సమయం అని చెప్పాలి. ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణకు బీసీసీఐ షార్ట్‌లిస్ట్ చేసిన మూడు ముఖ్యమైన వేదికల జాబితాలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం కూడా చోటు సంపాదించింది. చెన్నై, బెంగళూరు stadiaలతో పాటు హైదరాబాద్‌ను కూడా బీసీసీఐ పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం భారత్ – పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025కి తాత్కాలిక విరామం విధించబడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ వారం రోజుల పాటు మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. అనంతరం తిరిగి మ్యాచ్‌లు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వర్గాల సమాచారం.
ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం మిగిలిన 16 మ్యాచ్‌లను మూడు నగరాల్లో – చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ – నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. ఇందులో హైదరాబాద్‌లో క్వాలిఫయర్, ఎలిమినేటర్‌తో పాటు ఫైనల్ మ్యాచ్ కూడా జరగవచ్చని తెలుస్తోంది. ఇదే నిజమైతే హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఇది అసలైన క్రికెట్ పండుగే అవుతుంది. ప్రస్తుతం టోర్నమెంట్ నిలిపివేసే సమయానికి 12 లీగ్ మ్యాచ్‌లు, రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్ – ఫైనల్ మ్యాచ్ మిగిలి ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం మే 25న కోల్‌కతాలో ఫైనల్ జరగాల్సి ఉంది. టోర్నీ నిలిచే సమయంలో గుజరాత్, బెంగళూరు, పంజాబ్, ముంబై జట్లు టాప్ 4లో ఉన్నాయి.