నంబర్‌ ప్లేట్‌ సరిగ్గా లేదా..? చైన్‌ స్నాచింగ్‌ కేసు పెడతారు జాగ్రత్త..!

-

హైదరాబాద్‌లో ఉంటున్న వాహనదారులకు సీపీ అంజనీకుమార్‌ హెచ్చరికలు జారీ చేశారు. వాహనదారులు తమ తమ వాహనాల నంబర్‌ ప్లేట్లను స్పష్టంగా కనిపించేలా అమర్చుకోవాలని, లేకపోతే అలాంటి వారిని చైన్‌ స్నాచర్లుగా అనుమానిస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్వీట్‌ చేశారు.

హైదరాబాద్‌లో అనేక మంది తప్పుడు నంబర్‌ ప్లేట్లతో వాహనాలను నడుపుతున్నారని, తమ వద్ద అలాంటి వాహనాలకు చెందిన రికార్డులు 2వేల వరకు ఉన్నాయని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. నంబర్‌ ప్లేటు తప్పుగా ఉన్నా, ఉన్న నంబర్‌ ప్లేట్‌ స్పష్టంగా లేకున్నా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే తాజాగా నంబర్‌ ప్లేట్‌ సరిగ్గా లేని వాహనాలపై తిరుగుతున్న 384 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. నంబర్‌ ప్లేట్‌ సరిగ్గా లేకుండా ఎవరైనా వాహనదదారులు కనబడితే 9490616555 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా ఫొటో పంపించవచ్చని ఆయన తెలిపారు.

సాధారణంగా చైన్‌ స్నాచర్లు, రోడ్డు భద్రత నిబంధనలను పాటించనివారే నంబర్‌ ప్లేట్లను సరిగ్గా ఉంచుకోరని, అందువల్ల ఎవరైనా నంబర్‌ ప్లేటును సరిగ్గా ఉంచుకోకపోతే అలాంటి వారిని చైన్‌ స్నాచర్లుగా అనుమానించాల్సి వస్తుందని సీపీ హెచ్చరించారు. కాగా పోలీసులు అకస్మాత్తుగా నంబర్‌ ప్లేట్లపై హెచ్చరికలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version