దేశంలో ఇప్పుడు ఆల్కాహాల్ కోసం కొంత మంది పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. లైన్లో నిలబడలేక పాపం మందు తాగే కోరికను కూడా చంపుకునే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు సహా ఉత్తరాదిలోని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో మద్యం వాడకం అనేది ఎక్కువ. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నా గాని అక్కడ కొన్ని పరిస్థితుల కారణంగా మద్యానికి దూరంగా ఉంటారు.
మద్యాన్ని ఆన్లైన్ లో అందుబాటులోకి తీసుకురావాలని పలువురు డిమాండ్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఇంటర్నేషనల్ స్పిరిట్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అమ్రిత్ కిరణ్ సింగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. భారత్‌లో మద్యం ఆన్‌లైన్ అమ్మకాలు ఎంత త్వరగా ప్రారంభమయితే అంత మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ విషయంలో రాష్ట్రాలు తొందరపడాలని కిరణ్ సింగ్ పలు సూచనలు చేసారు. అభివృద్ధివైపు అడుగులేస్తున్న కొన్ని రాష్ట్రాలు ఈ విషయంలో మార్గదర్శకులుగా మారాలని ఆయన సూచనలు చేసారు. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు ప్రారంభించడానికి ఇదే సరైన సమయమని, ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే సదరు రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి ఆదాయం లభిస్తుందన్న ఆయన ప్రభుత్వాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిదన్నారు.