సుప్రీం తీర్పు అమ‌లు సాధ్యమేనా …!

-

అత్య‌ధిక జ‌నాభా, పేద‌రికం క‌ల‌బోత‌గా ఉన్న ఇండియాలో క‌రోనా వైర‌స్‌ను తుద‌ముట్టించ‌డం సాధ్య‌మేనా అన్న ప్ర‌శ్న నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉత్ప‌న్న‌మవుతోంది. ఈ వైర‌స్ బారి నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డానికి ధ‌నిక దేశాలు సైతం  ప్ర‌జ‌ల‌కు స‌త్వ‌ర వైద్య‌సేవ‌లు, వైద్య సిబ్బందికి ర‌క్ష‌ణను క‌ల్పించ‌లేక నిస్స‌హాయంగా చూస్తుంటే.. అసలు ఎటువంటి వైద్య సౌక‌ర్యాలు లేని 135 కోట్ల మంది భార‌తీయుల‌ను ఎవ‌రు ఆదుకుంటార‌నే ప్ర‌శ్నఅంత‌ర్జాతీయంగా ఎదుర‌వుతోంది. క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన ప‌రీక్ష‌ల‌న్నీ ఉచితంగా చేయాల‌ని సుప్రీంకోర్టు ఇటీవ‌ల ఇచ్చిన తీర్పుతో పేద ప్ర‌జ‌ల‌కు కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగినా.. వాస్త‌వంలో అది ఎంత వ‌ర‌కు వారికి స‌హాయ ప‌డుతుంద‌నే మీమాంస ఎదుర‌వుతోంది.

క‌రోనాకు సంబంధించిన అన్ని ప‌రీక్ష‌లు ఉచితంగా చేయాల్సిందిగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేప‌ధ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల స్పంద‌న‌పై ఆరా తీయ‌గా ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగు చూశాయి.  పేద ప్ర‌జ‌ల‌కు ఉచితంగా క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించినా అందుకు సంబంధించి పూర్తి మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేయ‌ని కార‌ణంగా ప్రైవేటు ఆసుపత్రులు వాటి నిర్వ‌హ‌ణ‌పై సందిగ్ధంలో ఉన్నాయి.

క‌రోనా వైర‌స్‌ టెస్టుకు అయ్యే ఖ‌ర్చు రూ. 4500లు. ఈ ఖ‌ర్చును ఆర్థికంగా భ‌రించ‌గ‌ల వారు బిల్లు చెల్లించేవిధంగా, నిరుపేద‌ల‌కు ప్ర‌భుత్వం చెల్లించే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్న‌ట్లు కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజ‌మాన్యాలు భావిస్తున్నాయి.

అయితే కోవిడ్-19 పరీక్ష కోసం ఒక్కో మ‌నిషిపై  రూ. 4,500 ఖర్చు చేయడం ప్రైవేటు ఆసుపత్రులకు కూడా ఆర్థికంగా భార‌మే. పైగా  ఆ మొత్తాన్ని ప్ర‌భుత్వం నుంచి ఏ విధంగా రీయింబర్స్ చేసుకోవాలనే విషయంలో కోర్టు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో చాలా ప్రైవేటు ల్యాబ్‌లు ప్ర‌జ‌ల‌కు కోవిడ్ -19 టెస్టులు చేయ‌డం నిలిపివేశాయి.  దీంతో కోవిడ్ 19 ప‌రీక్ష‌లు అధికంగా నిర్వ‌హించాల‌నే ప్ర‌భుత్వ ఆశ‌యం కూడా కుంటు ప‌డుతోంది. దీంతో సుప్రీంకోర్టు తీర్పును మ‌రోసారి ప‌రిశీలించాల‌ని ప్ర‌భుత్వాలు విజ్ఞ‌ప్తి చేశాయి.

దీంతో దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ప్రజారోగ్య బీమా పథకంలో ఉన్న50 కోట్ల మందికి ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని, మిగిలిన వాళ్లు సొంతంగా చెల్లించుకోవాలని ఏప్రిల్ 13న కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ తీర్పుతో ఒక వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు కొంత ఊర‌ట ల‌భించింది. ప్రభుత్వం వైద్య సంస్థల నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ సూచనల మేరకు ఇంటివద్దకు వెళ్లి కోవిడ్-19 పరీక్ష నిర్వహిస్తే రూ.4,500, అదే ఆస్పత్రికి వెళ్లి చేయించుకుంటే రూ.3,500గా నిర్ణయించింది. దీంతో ప్ర‌స్తుతం ఈ స‌మ‌స్య ఒక కొలిక్కి వ‌చ్చినట్టు ప్ర‌భుత్వం భావిస్తోంది.

అయితే కోవిడ్ 19 ప‌రీక్షలు ఉచితంగా నిర్వ‌హించ‌డం సాధ్యప‌డ‌కపోతే సామాన్యుల ప‌రిస్థితి ఏమిట‌నేది మ‌రో ప్ర‌శ్న‌. సుమారు 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో ఏప్రిల్ 21 నాటికి 18,601కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సుమారు 507 మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించే సామ‌ర్థ్యం చాలా త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల‌నే  కేసుల సంఖ్య త‌క్కువ‌గా ఉంద‌ని ప‌లువురు అభిప్రాయప‌డుతున్నారు. ఈనెల 19 నాటికి దేశ వ్యాప్తంగా కేవలం 3,86,791 మందికి మాత్రమే కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) అనుమతులు పొందిన టెస్టింగ్‌ కిట్ల తయారీ కంపెనీలు దేశంలో వేళ్ల మీద లెక్క పెట్టే స్థాయిలోనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా టెస్టింగ్ కిట్లకు డిమాండ్ ఉండటంతో దిగుమతులు కూడా ఆలస్యమవుతున్నాయి. అటు పరీక్షలు నిర్వహించే వైద్య సిబ్బందికి అవసరమైన రక్షణ సామాగ్రి సరఫరా కూడా తగినంతగా లేదు. ఈ అంశాల‌ను దృష్టిలో పెట్టుకొని కేంద్ర,రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోవిడ్ -19 నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు మ‌రింత చొర‌వ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్ర‌జ‌ల‌కు వైద్య స‌దుపాయాల‌ను అభివృద్ధి చేయ‌డానికి త‌గిన వ‌న‌రుల‌ను అత్య‌వ‌స‌రంగా విడుద‌ల చేసి ఆ దిశ‌గా చ‌ర్యలు తీసుకోవాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version