సాధారణంగా సచివాలయం అనేది రాష్ట్రానికి ఒక్కటే ఉంటుంది అన్న విషయం అందరికీ తెలుసు! కానీ… జగన్ ప్రభుత్వం వచ్చిన అనంతరం గ్రామానికి ఒక సచివాలయం వచ్చేసింది అన్నా అతిశయోక్తి కాదేమో! ఎందుకంటే… ప్రస్తుతం సచివాలయాలకు అన్ని పవర్స్ వచ్చేశాయి మరి! ఆ గ్రామ ప్రజలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ఆధినంలోని సమస్యలు కూడా అక్కడే పరిష్కరించపడబోతున్నాయి! దానికి కారణం జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయం!
తాను ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయం పరిధిని అంతకంతకూ విస్తరించేక్రమంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రస్తుతం ఏపని జరగాలన్నా… ఆధార్ కార్డ్ తప్పనిసరి అని కేంద్రప్రభుత్వం సూచించేసింది! ఈ క్రమంలో ఆధార్ కార్డుకు సంబంధించిన పలు సేవల్ని గ్రామ సచివాలయం పరిధిలోకి తీసుకొస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు జగన్. ఇందులో భాగంగా… కొత్త ఆధార్ కార్డులు మాత్రమే కాదు.. ఆధార్ కార్డుల్లో మార్పులు, చేర్పుల్ని కూడా ఇకనుంచి గ్రామ సచివాలయంలోనే చేపడతారు.
ఇప్పటివరకూ ఆధార్ కార్డులకు సంబంధించిన అన్ని రకాల సేవలనూ పోస్టాఫీసులు, కొన్ని బ్యాంకులతో పాటు.. మరికొన్ని కేంద్రాల్లోనే చేపట్టేవారు. అందుకు భిన్నంగా గ్రామ సచివాలయ పరిధిలోకి ఆధార్ సేవల్ని తీసుకురావటం ద్వారా.. జగన్ ప్రజలకు మరింత మేలు జరిగిందన్నమాట. కాగా… రిజిస్ట్రేషన్స్ కి సంబందించి కూడా గ్రామ సచివాలయాలకు జగన్ కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే! ఇవన్నీ చూస్తున్న జనం మాత్రం.. ఇది గ్రామ సచివాలయమా.. రాష్ట్ర సచివాలయమా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు!