ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగిన విషయం తెలిసిందే. కరెక్ట్ గా అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉందనగా జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్ మాదిరిగా నడుస్తున్నాయి. మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల కోటాలో 9 స్థానాలు, టీచర్ ఎమ్మెల్సీలు 2, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు 3. మొత్తం 14 స్థానాలు. అయితే స్థానిక సంస్థలు మొత్తం వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి 9 స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడతాయి. ఇటు టీచర్ల స్థానాలపై పెద్దగా రాజకీయ పోటీ ఉండకపోవచ్చు.
ఇక పోటీ మొత్తం గ్రాడ్యుయేట్ స్థానాలకే. మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, అనంతపురం-కర్నూలు-కడప, విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాలని కైవసం చేసుకోవాలని అటు వైసీపీ, ఇటు టిడిపిలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. మధ్యలో బిజేపి కూడా పోటీకి వచ్చింది. ఇంకా పలువురు అభ్యర్ధులు రేసులో ఉన్నారు. గ్రాడ్యుయేట్ల తీర్పు బట్టే రాష్ట్రంలో ఓటరు నాడీ తెలుస్తుందని అనుకుంటున్నారు. అయితే గ్రాడ్యుయేట్లు తమ వైపే ఉంటారని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి.
అదే సమయంలో ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదు. కానీ ఎవరికి మద్ధతు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. పైకి బీజేపీతో జనసేన పొత్తు ఉంది..కానీ జనసేన శ్రేణులు బిజేపికి సపోర్ట్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. పరోక్షంగా టిడిపికి సహకారం అందిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటులో జనసేన ప్రభావం కాస్త ఉంటుంది. అక్కడ జనసేనపైనే బిజేపి ఆశలు పెట్టుకుంది.
కానీ జనసేన మాత్రం బిజేపి వైపు నిలిచే అవకాశాలు కనిపించడం లేదు. జనసేనని అభిమానించే గ్రాడ్యుయేట్లు టిడిపికి మద్ధతు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. మొత్తానికి జనసేన..టీడీపీకే సపోర్ట్ చేసేలా ఉంది.