ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని చెప్పవచ్చు. జిల్లాలో కాంగ్రెస్ హవా ఉంటుంది. అలాగే నల్గొండ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇంకా చెప్పాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డా. అయితే నల్గొండ అసెంబ్లీలో మొదట నుంచి కాంగ్రెస్ హవా నడుస్తూనే ఉంది. 1967 నుంచి అక్కడ కాంగ్రెస్ హవా ఉంది..కానీ 1983లో టీడీపీ హవాలో కాంగ్రెస్ పార్టీకి చెక్ పడింది. 1983, 1985, 1989 ఎన్నికల్లో అక్కడ టిడిపి గెలిచింది. 1985లో ఎన్టీఆర్ నల్గొండలో పోటీ చేసి గెలిచారు. అదే ఎన్నికల్లో హిందూపురం, గుడివాడల్లో గెలిచారు.
దీంతో గుడివాడ, నల్గొండ స్థానాల్లో రాజీనామా చేసి..హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగారు. దీంతో ఉపఎన్నికల్లో నల్గొండలో మళ్ళీ టిడిపి గెలిచింది. ఇక నల్గొండ అసెంబ్లీలో 1994లో సిపిఎం గెలవగా, ఆ తర్వాత నుంచి కోమటిరెడ్డి హవా మొదలైంది. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు కోమటిరెడ్డి గెలిచారు. కానీ 2018 ఎన్నికల్లో దాదాపు 23 వేల ఓట్ల మెజారిటీతో కోమటిరెడ్డి..బిఆర్‌ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
అయితే ఆ తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇక వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి మళ్ళీ నల్గొండ అసెంబ్లీలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సారి ఎలాగైనా నల్గొండని కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కంచర్ల బలం అలాగే ఉంది..అయితే ఓడిపోయిన సానుభూతి కోమటిరెడ్డిపై ఉంది.
ఈ సారి మాత్రం కోమటిరెడ్డి గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతానికి నల్గొండలో బిఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉంది. ఇక్కడ బిజేపికి బలం లేదు. మరి చూడాలి ఈ సారి నల్గొండలో కోమటిరెడ్డి గెలిచి గట్టెక్కుతారో లేదో.