బ్ర‌ద‌ర్ అనిల్‌తో జ‌గ‌న్ దూరం.. వాళ్లే కార‌ణ‌మా…!

-

సొంత బావ‌, చెల్లెలి భ‌ర్త‌.. బ్ర‌ద‌ర్ అనిత్‌లో సీఎం జ‌గ‌న్ ఘ‌ర్ష‌ణ ప‌డ్డారా ? ఆయ‌న‌కు దూరంగా ఉన్నారా ? ఈ వ్య‌వ‌హారం కుటుంబంలో క‌ల‌హాల‌కు కూడా కార‌ణ‌మైందా ? ఈ మొత్తం వ్య‌వ‌హారం వెనుక బీజేపీ పెద్ద‌లు ఉన్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు.. వైసీపీలోని అత్యంత విశ్వ‌స‌నీయ ఎమ్మెల్యేలు. నిజానికి కుటుంబాన్ని రాజ‌కీయాల‌కు చాలా ద‌గ్గ‌ర చేసింది జ‌గ‌నే. ఆయ‌న సోద‌రి ష‌ర్మిల‌ను రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చారు. త‌ల్లి విజ‌య‌మ్మ‌కు ఏకంగా 2014లో విశాఖ ఎంపీ టికెట్ ఇచ్చారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో క‌డ‌ప జిల్లా మొత్తాన్ని గెలిపించే బాధ్య‌త‌ను స‌తీమ‌ణి.. భార‌తికి అప్ప‌గించారు. గ‌త ఎన్నిక‌ల్లో క‌డ‌ప జిల్లాలో కొంద‌రు ఎమ్మెల్యేల‌కు భార‌తీయే ద‌గ్గ‌రుండి మ‌రీ ఆర్థిక‌సాయం చేశార‌న్న టాక్ ఉంది.

ఇలా రాజ‌కీయాల‌కు ముందు అంద‌రినీ రంగంలోకి దింపిన జ‌గ‌న్‌.. ఒక్క బ్ర‌ద‌ర్ అనిల్‌ను మాత్రం దూరం పెట్టారు. ఆయ‌న ఎక్క‌డా ప్ర‌త్య‌క్షంగా జ‌గ‌న్‌ను స‌పోర్టు చేసిన ఉదంతం క‌నిపించ‌దు. అయితే, ఇప్పుడు పూర్తిగా అనిల్‌ను దూరం పెట్టార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇది కుటుంబంలో క‌ల‌హాల‌కు కూడా కార‌ణ‌మైంద‌ని చెబుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. బీజేపీ పెద్ద‌ల సూచ‌న‌లు ఉన్నాయ‌ని, అదే స‌మ‌యంలో త‌న‌పైనా వ్య‌తిరేక ప్ర‌భావం ప‌డుతుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. విష‌యంలోకి వెళ్తే.. స‌హ‌జంగానే సువార్తీకుడు అయిన అనిల్‌కుమార్‌.. ఏటా డిసెంబ‌రు, జ‌న‌వ‌రి మాసాల్లో ఏపీల్లోని విజ‌య‌వాడ‌, తిరుప‌తి, విశాఖ త‌దిత‌ర ప్ర‌ధాన న‌గ‌రాల్లో కూటాలు ఏర్పాటు చేసి మ‌త ప్రార్థ‌న‌లు చేస్తారు.

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో కూడా అనిల్ ఉమ్మ‌డి రాష్ట్రంలో ఆ రెండు మాసాల్లో భారీగానే కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేసుకుని ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. అయితే, గ‌త ఏడాది డిసెంబ‌రు, ఈ ఏడాది జ‌న‌వ‌రిలోనూ ఏపీలో కార్య‌క్ర‌మాలు చేసుకునేందుకు ప్ర‌ణాళిక చేసుకున్నారు. అయితే, దీనికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని అంటున్నారు. ఇలా సొంత బావ‌తోనే ప్రార్థ‌న‌లు చేయిస్తే.. త‌న ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని ఆయ‌న భావించార‌ని ఒక ప్ర‌చారం జ‌రుగుతోంది.

అదే స‌మ‌యంలో బీజేపీ పెద్దల నుంచి ఇలాంటి కార్య‌క్ర‌మాలకు అనుమ‌తి ఇవ్వొద్ద‌ని సూచించార‌ట‌. దీంతో అనిల్ అలిగార‌ని, అప్ప‌టి నుంచి జ‌గ‌న్‌కు దూరంగా ఉంటున్నార‌ని అంటున్నారు. జూలై 8న వైఎస్ జ‌యంతిని సీఎం జ‌గ‌న్ ఘ‌నంగా నిర్వ‌హించారు. అయితే, ఈకార్య‌క్ర‌మానికి కూడా అనిల్ దూరంగా ఉన్నారు. ఈ ప‌రిణామాలే కుటుంబంలో క‌ల‌హానికి కార‌ణ‌మ‌య్యాయ‌ని ప్ర‌చారం అయితే జ‌రుగుతోంది. మ‌రి వీటిల్లో నిజానిజాలు ఏంటో వారికే తెలియాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version