చిన్నపిల్లలు నడక నేర్చుకునే సమయంలో కాళ్లు ఎత్తి నడుస్తారు. అయితే ఇలా అందరిలో ఉండదు. మొదట కొన్నాళ్లు ఇలా కాళ్లు ఎత్తి నడిచినా ఆ తర్వాత బానే నడుస్తారు. కానీ కొందరు అలానే కాళ్లు ఎత్తే నడుస్తుంటారు. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి.ఇంట్లో వాళ్లు తల్లి పాలు ఎక్కువగా తాగకపోవడం వల్ల ఇలా జరుగుతుందని భావిస్తారు. 15నెలల వయసునుంచి పిల్లలు నడవడం ప్రారంభిస్తారు. అప్పుడే మనం వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. స్కానింగ్ తీయించినా వైద్యులు కూడా కచ్చితంగా ఏం చెప్పలేరు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి..? అశ్రద్ధ చేస్తే ఎప్పటికీ అలా కాళ్లు ఎత్తి నడవటానికే అలవాటు పడతారు. ఇంతకీ ఇలా నడవటానికి కారణం ఏమై ఉండొచ్చు..?
వైద్యులు ఏమంటున్నారంటే.. బుడిబుడి అడుగులేసే సమయంలో నడక కాస్త తేడాగా కనిపించటం సహజమే. ఎందుకంటే శరీరం బరువు అప్పుడప్పుడే కాళ్ల మీద పడటం మొదలవుతుంటుంది. దీంతో బరువును సమన్వయం చేసుకోవటానికి పిల్లలు వివిధ భంగిమల్లో నడుస్తుంటారు. కొందరు కాళ్లు వంచి నడవచ్చు. కొందరు మడమలను ఎత్తి నడవచ్చు. ఇవన్నీ మామూలే.
వయసు పెరుగుతున్న కొద్దీ వాటంతటవే సరి అవుతాయి. సాధారణంగా ఐదేళ్లు వచ్చేసరికి కరెక్టుగా నడుస్తారు. ఎత్తు కాళ్ల మీద నడవటానికీ చనుబాలకూ ఎలాంటి సంబంధం లేదు. చనుబాలు ఎక్కువ కాలం తాగిన పిల్లలైనా కూడా తొలిసారి కాళ్ల మీద శరీరం బరువును మోపే సమయంలో పాదాలు అటూ ఇటూ వేస్తుంటారు. దీనికి భయపడాల్సిన పనేమీ లేదు.
కాకపోతే పిల్లలకు అదనంగా విటమిన్ డి అవసరం.. పూర్తిగా నెలలు నిండి, మామూలు బరువుతో (3 కిలోలు) పాప పుట్టినట్టయితే రోజుకు 400 ఐయూ మోతాదు వరకు విటమిన్ డి ఇవ్వాలి. ఒకవేళ నెలలు నిండకముందే, తక్కువ బరువుతో పుట్టినట్టయితే రోజుకు 600-800 ఐయూ మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. నెలలు నిండకముందే పుడితే క్యాల్షియం, ఫాస్ఫరస్ కూడా అవసరం అవుతాయి. ఎముకలు బలంగా ఉండటానికి ఈ మూడూ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.
ఇలా చేస్తే నిర్లక్ష్యం చేయొద్దు..
ఒకవేళ పాప నిల్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు మోకాళ్లు మరీ దూరంగా గానీ దగ్గరకు గానీ ఉన్నా (యాంగ్యులేషన్).. ఒక కాలే బలహీనంగా ఉన్నా, పాదాలు ఈడుస్తూ నడుస్తున్నా, పాదంలో వాపు వస్తున్నా నిర్లక్ష్యం చేయొద్దు. ఇవి కండరాలను క్షీణింపజేసే సమస్యలకు సంకేతాలు కావొచ్చు. డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం.