పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఉత్తరప్రదేశ్‌లోని రామజన్మభూమిపై ఆగస్టు 15న ఉగ్రదాడికి పాల్పడే అవకాశం ఉందని తెలిసింది. ఈ మేరకు రీసెర్చ్ అండ్ ఇంటెలిజెన్స్ వింగ్ (రా) ఒక ప్రకటన విడుదల చేసింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఐఎస్ఐ ద్వారా శిక్షణ పొందిన పలువురు ఉగ్రవాదులు రామజన్మభూమిపై దాడులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఐఎస్ఐ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన లష్కర్-ఇ-తయిబా (ఎల్ఈటీ), జైష్-ఇ-మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాదులు ఆఫ్గనిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చి 3 లేదా 5 గ్రూపులుగా ఏర్పడి దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారు భారత్‌లో జరిగిన అంతర్గత దాడిగా దాన్ని చిత్రీకరించే యత్నం కూడా చేయవచ్చని సమాచారం అందుతోంది. ఇక ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో పలువురు వీవీఐపీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజ చేయనున్నారు. కాగా నిఘా వర్గాలు మాత్రం ఆగస్టు 15న ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని చెబుతుండడం గమనార్హం. ఇక మోదీ అయోధ్యకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే భద్రతా సంస్థలు అయోధ్యను తమ ఆధీనంలోకి తీసుకుని మొత్తం పట్టణాన్ని 3 సెక్యూరిటీ జోన్లుగా విభజించాయి. ఈ క్రమంలో రామ మందిర నిర్మాణ భూమి పూజకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.