మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150, సైరా చిత్రాలకి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన సుస్మిత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి ఈ బేనర్‌పై వైవిధ్యమైన వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నారు. అయితే వికారుద్దీన్ ఎన్‌కౌంటర్ ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ షూట్ అవుట్ ఎట్ ఆలేరు చుట్టూ వివాదాలు ముసురుతున్నాయి. 2015 ఏప్రిల్ 7 న ఆలేరులో వికారుద్దీన్ ఎన్‌కౌంటర్ జరిగింది. దీని ఆధారంగా జీ 5 యప్ కోసం వెబ్ సీరీస్ రూపొందిస్తున్నారు.
ఈ కాల్పుల్లో వికారుద్దీన్ తో పాటు రియాజ్ , జాకీర్ , అంజద్ , సయ్యద్ చనిపోయారు. అయితే ఈ సిరీస్‌ను తీవ్రంగా తప్పుబడుతోంది ఎంబీటీ. వికారుద్దీన్ ఇష్యూలో అందరినీ దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నది ఎంబీటీ ప్రధాన ఆరోపణ. అలాగే నిందితుల కుటుంబాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని అంటున్నారు. అందువల్ల వెంటనే షూట్ అవుట్ ఎట్ ఆలేరు ప్రోమో ఆపాలంటూ డిమాండ్ చేశారు ఎంబీటీ నేత అంజదుల్లా ఖాన్. అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇవ్వాలన్న నష్ట పరిహారాన్ని కూడా ప్రభుత్వం ఇంత వరకు ఇవ్వలేదని ఆరోపించారు.