సిద్దిపేట: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. మోడ్రన్ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి మంత్రి హరీష్ రావు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు దేశంలోనే అతి పెద్ద 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహం ప్రారంభిస్తున్నామని తెలిపారు. సచివాలయం లో నుండి చూస్తే ఒకవైపు అమరవీరుల స్థూపం, మరోవైపు అంబేడ్కర్ విగ్రహం కనబడుతుందన్నారు.
అది అంబేడ్కర్ విగ్రహం కాదు.. విప్లవ రూపం అన్నారు హరీష్ రావు. అంబెడ్కర్ విగ్రహం ఆకారానికి ప్రతీక కాదు.. తెలంగాణ ప్రజల చైతన్య దీపిక అన్నారు. ఇంకా దళితులకు జరగవలసినది చాలా ఉందని.. దళిత, గిరిజనుల అభ్యున్నతి కోసం తప్పకుండా కృషి చేస్తామన్నారు. ఇప్పుడు దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తుందన్నారు. అంబేడ్కర్ ముందు చూపు వల్ల దేశంలో అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నామన్నారు. దళితులు, గిరిజనుల కోసం ముఖ్యమంత్రి ఎన్నో పథకాలు తెచ్చారని వివరించారు.