భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు హుజురాబాద్ బిజెపి శాసనసభ్యులు ఈటెల రాజేందర్. అంబేద్కర్ కలలు కన్న జాతి నిర్మాణం జరగాలన్నారు. కులాలు, అసమానతలు లేని సమాజం కోసం అంబేద్కర్ కలలుకన్నారని అన్నారు. తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి సీఎం దళితుడని ప్రకటించిన తర్వాత తొలి ఉల్లంఘన జరిగిందన్నారు.
మాల, మాదిగ అని జాతులను విడదీసారన్నారు. దళితులను ముఖ్యమంత్రి చెయ్యకపోగా ఉన్న ఒక్క దళిత మంత్రిని కూడా ఏవో కారణాలు చెప్పి తొలగించారని మండిపడ్డారు. మహనీయుడు కలలు కన్న జాతికి తెలంగాణలో అడుగడుగున అన్యాయం జరుగుతుందన్నారు ఈటెల రాజేందర్. విగ్రహాలు, సెక్రటరీయేట్ కు పేరు పెట్టినంత మాత్రాన తెలంగాణ లో న్యాయం జరగలేదన్నారు. సీఎంలో తాను డిమాండ్ చేసిన తర్వాత ఒక దళిత అధికారిని నియమించారని చెప్పారు.
తెలంగాణ ప్రజల్లో పుట్టగతులు ఉండవని తెలిసి కేసీఆర్ అంబేద్కర్ జపం అందుకున్నారని విమర్శించారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం, 125 అడుగుల విగ్రహం పెట్టడం సంతోషం అన్నారు. తెలంగాణలో దళితులకు ఇచ్చిన హామీలు అమలు జరగడం లేదన్నారు ఈటెల. గత ప్రభుత్వాలు దళితులకు ఇచ్చిన భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ఆరోపించారు. దళితుల అస్సైన్డ్ భూములను తిరిగి వారికి వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు.