రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ బీజేపీ నిరుద్యోగ మార్చ్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ మార్చ్ చేయాల్సింది తెలంగాణలో కాదు.. ఢిల్లీలో మోదీ ఇంటి ముందు చేయాలని అన్నారు కేటీఆర్. ప్రతిపక్షాల మాటలను నమ్మొద్దని యువత, నిరుద్యోగులకు కేటీఆర్ కోరారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ, బీజేపీ నేతలు నిరుద్యోగుల కోసం ధర్నాలు చేపడుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో మోదీ.. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అన్నారు. ఆ మాట ప్రకారం ఈ 9 ఏండ్లలో 18 కోట్ల ఉద్యోగాలు రావాలన్నారు కేటీఆర్. సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నా.. బీజేపీ నాయకుల్లారా.. కనీసం 18 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండా.. నిరుద్యోగ మార్చ్.. ఇక్కడ కాదు.. ఢిల్లీలోని నరేంద్ర మోదీ ఇంటి ముందు చేయాలి అని మండిపడ్డారు కేటీఆర్.
రైతుల ఆదాయం డబుల్ చేస్తనని అన్నారు . కానీ రైతుల కష్టాలు డబుల్ అయ్యాయి. నల్లధనం ఎక్కడ అని అడిగితే తెల్లముఖం వేస్తున్నాడు. దేశంలో ఎవరైనా అసమర్థత ప్రధాని ఉన్నారంటే.. అతను మోదీనే. మీ నరేంద్ర మోదీ ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా లేవా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం రంగ సంస్థలు అమ్ముతూ.. లక్షల ఉద్యోగాలకు పాతర వేస్తలేరా..? అని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు గండి కొడుతూ.. మా తమ్ముళ్ల నోట్లో మట్టి కొడుతూ.. మీరు నిరుద్యోగ మార్చ్ చేస్తే నమ్మేందుకు ఈ తెలంగాణ ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ అని అంటూ మండిపడ్డారు. ఇది హుషారైన తెలంగాణ.. కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్న తెలంగాణ. మీ చిల్లర మల్లర మాటలకు పడిపోయే తెలంగాణ కాదు. ఎవరు ఏందో మాకు తెలుసు అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తపరిచారు.