మీరు పాలించే రాష్ట్రాలకు వెళ్దామా.. ప్రతిపక్షాలకు కేటీఆర్ ఛాలెంజ్

-

ప్రతిపక్షాలపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణలో జరుగుతున్న పనులు.. వారు పాలించే ఏ ఇతర రాష్ట్రంలోనైనా జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. కావాలంటే మీరు పాలించే రాష్ట్రాలకు వెళ్దామా.. అక్కడ ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో చూద్దామా.. అంటూ ప్రతిపక్షాలకు కేటీఆర్ సవాల్ విసిరారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ వ్యవసాయ వర్సిటీలో జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల ప్రదానోత్సవంలో కేటీఆర్ పాల్గొన్నారు. తొమ్మిది కేటగిరీల్లో 50 అవార్డులను ప్రదానం చేశారు.

సర్పంచ్​లు చేసిన పనులకు సంబంధించి.. రూ.1300 కోట్లు చెల్లింపులు చేశామని తెలిపారు. శత్రుదేశంపై పగ పట్టినట్లు కేంద్రం తెలంగాణపై ఆంక్షలు విధిస్తోందని ఆరోపించారు. ఏదో రకంగా రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేసేందుకు చూస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర అభివృద్ధిలో అగ్రస్థానం.. అవినీతిలో అట్టడుగు స్థానం ఉందని వివిధ సర్వేలు చెబుతున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

పల్లె వాతావరణంపై తనకు అవగాహన కొంచెం తక్కువేనని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పల్లెలపై లోతైన అవగాహన ఉందని.. కొందరు పెద్దలు చెప్పారని అన్నారు. తొలిసారి గెలిచిన ప్రజాప్రతినిధులకు తమ విధులపై పూర్తి అవగాహన ఉండట్లేదని తెలిపారు.  ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయకపోతే అభివృద్ధి జరగదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version