మేం కూడా ప్రశ్నిస్తాం.. పసుపు బోర్డు ఫ్లెక్సీలపై ఎంపీ అర్వింద్ రియాక్షన్

-

‘పసుపు బోర్డు’ ఏర్పాటుపై నిజామాబాద్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం వెలసిన ఫ్లెక్సీలు స్థానికంగా కలకలం సృష్టించాయి. నిజామాబాద్‌లోని ప్రధాన చౌరస్తాలతో పాటు డిచ్‌పల్లి, బోధన్‌, ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లోనూ పసుపు రంగు ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ‘పసుపు బోర్డు.. ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు’… అంటూ ఫ్లెక్సీల్లో రాశారు. ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.

పసుపు బోర్డు తీసుకొస్తానని గత పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫ్లెక్సీల అంశంపై అర్వింద్‌ స్పందించారు. సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు.

‘గతంలో బీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో ఓ ప్రశ్న అడిగారు. మధ్యప్రదేశ్‌, తమిళనాడుల్లో ధనియాలకు స్పైస్‌ బోర్డు పెట్టారా? మిర్చి కోసం ఏపీ, మధ్యప్రదేశ్‌, తమిళనాడుల్లో 3 స్పైస్‌ బోర్డులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారా? నిజామాబాద్‌లో పసుపుబోర్డుకు ప్రతిపాదన ఉందా? అని ప్రశ్నించారు. ఈ పంటలన్నీ స్పైస్‌బోర్డు కిందకు వస్తాయని కేంద్రం సమాధానమిచ్చింది. ప్రత్యేకంగా పసుపు పంట కోసం నిజామాబాద్‌లో స్సైస్‌బోర్డుపెట్టి రూ.30కోట్లు ఇచ్చినట్లు ఆ జవాబు ద్వారా వెల్లడైంది. పసుపుధర పడిపోయిందని..ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా రాష్ట్రప్రభుత్వం లేఖ రాయడం లేదు. బీఆర్ఎస్ హామీలైన.. రెండు పడక గదుల ఇళ్లు, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై మేం కూడా ప్రశ్నిస్తాం’ అని అర్వింద్‌ ఆ వీడియోలో చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version