కరోనాపై పోరాటం చేసేందుకు యావత్ భారతదేశం కదలి వస్తోంది. కరోనాను అంతం చేసేందుకు అనేక రంగాలకు చెందిన వారు, సామాన్యులు కూడా నూతన పరికరాలను ఆవిష్కరిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా బెర్హంపూర్‌కు చెందిన ఐటీఐ బృందం ఓ నూతన రోబో వాహనాన్ని అభివృద్ధి చేసింది. దీన్ని యూవీసీ రోబో వారియర్ గా వ్యవహరిస్తున్నారు. దీన్నుంచి అల్ట్రా వయొలెట్ (అతి నీలలోహిత) కిరణాలు వెలువడతాయి. ఆ కిరణాలు పడే ప్రదేశంలో ఉండే బాక్టీరియా, వైరస్‌లు వెంటనే నశిస్తాయి.
యూవీసీ రోబో వారియర్‌లో పలు సెన్సార్లు ఉంటాయి. ఇవి ఓ వైపు రోబో తిరిగే ప్రదేశంలో సదరు కిరణాలను ప్రసారం చేయడంతోపాటు తమ దారిలో వచ్చే అవరోధాలను గుర్తించి పక్కకు తప్పుకోగలుగుతాయి. దీంతో రోబో సాఫీగా ముందుకు సాగుతుంది. ఇక రోబోను ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. అందులో ఉండే యాప్‌కు బ్లూటూత్ ద్వారా ఈ రోబో కనెక్ట్ అవుతుంది. దీంతో ఫోన్ ద్వారా రోబోను నడిపించవచ్చు. అలాగే రోబోకు అమర్చబడిన కెమెరాతో రోబో ఎక్కడ ఉందో, ఏ ప్రదేశంలో తిరుగుతుందో సులభంగా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
ఈ రోబో నుంచి 254 మిల్లీమీటర్ల తరంగ ధైర్ఘ్యం (Wave Length) కలిగిన అతినీలలోహిత కిరణాలు వెలువడుతాయి. ఈ క్రమంలో ఈ కిరణాలు అవి పడే ప్రదేశంలో ఉండే బాక్టీరియా, వైరస్‌లను చంపుతాయి. దీంతో కోవిడ్ హాస్పిటళ్లలో పేషెంట్లు ఉండే గదులు, ప్రజా రవాణా వాహనాలు, ఇతర అనేక చోట్ల సూక్ష్మ క్రిములను ఎప్పటికప్పుడు నిర్మూలించవచ్చు. ఈ రోబోను తయారు చేసేందుకు సదరు ఐటీఐ బృందానికి కేవలం రూ.7500 మాత్రమే ఖర్చయింది. వారికి ప్రభుత్వాలు సహాయం అందిస్తే ఇలాంటి రోబోలను తయారు చేసి కోవిడ్‌పై పోరుకు వాటిని అందజేస్తామని చెబుతున్నారు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూడాలి.