ప్రపంచ దేశాలు అన్నింటినీ కరోనా తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. అమెరికా లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అక్కడ నిమిషానికి ముగ్గురు చొప్పున కరోనా కారణంగా మృతి చెందుతున్నారు. గడచిన 24 గంటల్లో 4,591 మంది కరోనా సోకి మృతి చెందారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా మరణాలు 35,000 పై మాటే, అంతే కాకుండా కరోనా బాధితులు దాదాపు 7 లక్షల మంది.
అమెరికాలో కరోనా వైరస్ అత్యంత ఎక్కువగా విస్తరిస్తున్న నగరాలలో న్యూజెర్సీ ఒకటి. అమెరికాలో కరోనా కట్టడికి ఒకపక్క ప్రభుత్వం ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించగా, ట్రంప్ కుమార్తె ఇవాంక మాత్రం తన భర్త, కుటుంబ సభ్యులతో కలిసి వాషింగ్టన్ నుంచి న్యూజెర్సీ వెళ్లారు. ఇంటి వద్ద ఉండే అదృష్టం ఉన్నవారంతా దయచేసి ఇంట్లోనే ఉండండి అని ప్రజలకు పిలుపునిచ్చిన ఇవాంక ఇలా పండగ నిమిత్తం న్యూజెర్సీ వెళ్లారని అక్కడి మీడియా చెప్పింది.
యూదుల పండుగ పాసోవర్ లో పాల్గొనేందు ఇవాంక అక్కడకు వెళ్లారని శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. న్యూజెర్సీలోని బెడ్‌మినిస్టర్‌లో జరిగిన పాసోవర్ వేడుకల్లో భౌతికదూరం పాటిస్తు కుటుంబ సభ్యులతో కలిసి ఇవాంక పాల్గొన్నారు. ప్రస్తుతం అక్కడి నుంచే ఇవాంక ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. ఇవంకా భర్త కుష్నెర్ మాత్రం అధ్యక్షునికి సహాయపడేందుకు శ్వేతసౌధానికి తిరిగి రావడం జరిగింది అని ద న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.