బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీలాండరింగ్ కేసులో ఇవాళ దిల్లీలోని పటియాలా కోర్టుకు హాజరయ్యారు. నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు దిల్లీ కోర్టు మధ్యంత బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 10వ తేదీ వరకు కోర్టు మధ్యంత బెయిల్ మంజూరు చేసింది.
నేటితో ఈ బెయిల్ ముగియడంతో ఆమె ఇవాళ పటియాలా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్, ఇతర పెండింగ్ దరఖాస్తులపై నేడు కోర్టు విచారణ చేపడుతోంది. జాక్వెలిన్‌కు సుకేశ్ చంద్రశేఖర్ రూ.7 కోట్లకు పైగా విలువైన ఆభరణాలను బహుమతిగా ఇచ్చారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు 17న దిల్లీ కోర్టులో సుకేశ్‌పై దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్ పిటిషన్‌లో జాక్వెలిన్ పేరును నిందితురాలిగా పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే పలుమార్లు ఆమెను విచారించిన సంగతి తెలిసిందే.