నల్గొండ జిల్లా తుంగతుర్తిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి, పలు అభివృద్ధి పనులకు మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. తుంగతుర్తి నియోజకవర్గంలో రక్తం పారిచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అయితే, నీళ్లు పారిచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతోనే తుంగతుర్తి ససశ్యామలం అయిందన్నారు జగదీశ్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రాత్రి పగలు తేడాలు లేకుండా హరీష్ రావు చేసిన కృషి ఫలితమే ప్రస్తుతం కనువిందు చేస్తున్న పచ్చని పొలాలు అని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని 9 ఏళ్లలో చేసిన ఘనత ఎమ్మెల్యే కిషోర్‌ది అని జగదీశ్ రెడ్డి చెప్పారు.
నియోజక అభివృద్ధి కోసం నిత్యం 18 గంటల పాటు కష్టపడిన కిషోర్ కృషి కారణంగా తుంగతుర్తి నియోజకవర్గంలో నలవైపులా అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. గాదరి కిషోర్ నాయకత్వమే తుంగతుర్తి ప్రజలకు అండ 4అన్న మంత్రి మరోసారి కిషోర్‌ను ఆశీర్వదించి తుంగతుర్తి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. 2014కు ముందు నియోజకవర్గంలో నిత్యం ఎక్కడో ఒక చోట రక్తం ఏరులై పారేదన్న మంత్రి, గ్రామాల్లో ఘర్షణలు, కొట్లాటలు పెట్టడమే కాంగ్రెస్ నేతల సిద్ధాంతం అని మండిపడ్డారు. కిషోర్ నాయకత్వంలో తుంగతుర్తి నియోజకవర్గం ప్రశాంతంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ 2014 ముందు పరిస్థితులను, ప్రస్తుతమున్న పరిస్థితులను బేరీజు వేసుకొని సరైన నిర్ణయం తీసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డి కోరారు.