చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని… ఎమ్మర్వో వనజాక్షిపై దాడి చేస్తే… తప్పందా ఆమెదే అన్నట్లుగా నాటి ముఖ్యమంత్రి స్పందించారు! దీనిపై అప్పట్లో పలు విమర్శలే వచ్చాయి. చింతమనేని అరాచకాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయని ఇప్పటివరకూ ఆయనపై సుమారు 50కి పైగా కేసులు ఉన్నా… ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం అది. మొక్కై వంగనిది మ్రానై వంగునా! ఇలాంటి కార్యక్రమాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటుంది జగన్ ప్రభుత్వం.
ప్రభుత్వ అధికారులపై, మరి ముఖ్యంగా మహిళా ప్రభుత్వ అధికారులపై ఎవరైనా పద్దతి మరిచి ప్రవర్తించినా, బాబు హయాంలో ప్రవర్తించినట్లు పిచ్చి పిచ్చి చేష్టలు చేసినా తాట తీసేలా చట్టాలను ప్రయోగించనున్నారు. ఇప్పటికే దిశా చట్టం ద్వారా ఆడపడుచులకు అండగా కీలకనిర్ణయాలు తీసుకుంటున్న జగన్… తాజాగా అయ్యన్నపాత్రుడిపై దిశాచట్టాన్ని ప్రయోగించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణిని అసభ్యంగా దూషించిన ఘటనకు సంబంధించి టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది.
కమిషనర్ ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీస్లు చెబుతున్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్ ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో అయ్యన్నపాత్రుడి తాత లత్సాపాత్రుడు చిత్రపటాన్ని అధికారులు ఇటీవల చైర్మన్ గదిలోకి మార్చారు. దాంతో పీక్స్ కి చేరిందో ఏమో కానీ… తన తాత ఫోటోను యథాస్థానంలో ఉంచాలని అంటూ అయ్యన్నపాత్రుడు మున్సిపల్ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలతో నిరసనకు దిగారు.
హాల్ కు రంగులు వేస్తున్నామని నెల రోజుల్లో చిత్రపటాన్ని యథాస్ధానంలో ఉంచుతామని కమిషనర్ వివరణ ఇచ్చినా కూడా అయ్యన్న అయ్యన్న ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సరికదా… చిత్రపటాన్ని నెల రోజుల్లో యథాస్థానంలో పెట్టకపోతే “కమిషనర్ బట్టలు ఊడదీసే పరిస్థితి వస్తుందని” హెచ్చరించారు. దీంతో అయ్యన్నపాత్రుడి దుర్భాషలతో మనస్తాపం చెందిన కమిషనర్… పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది.
వారు అధికారంలో ఉన్నప్పటిలాగా… మహిళా అధికారులపై రాజకీయ నాయకులు దురుసుగా ప్రవర్తించినా కూడా లైట్ తీసుకోలేదనో ఏమో కానీ… చినబాబు లోకేశ్ తెగ ఫీలయిపోయి, జగన్ పై ఫైరయిపోతున్నారు. అయ్యన్నపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ట్విట్టర్ లో కేకలేస్తున్నారు. ఇక టీడీపీ నేత వర్ల రామయ్య లైన్ లోకి వచ్చారు. ఏదో… మాట తూలినంతమాత్రాన్న అయ్యన్నపాత్రుడిపై నిర్భయ చట్టాన్ని ప్రయోగిస్తారా? అంటూ మండిపడ్డారు!
మాట తూలాడని వదిలేస్తే.. ఆమాట నెరవేరుస్తాడు, అంతపనికీ వడిగడతాడు… రిస్క్ తీసుకోలేమని భావించారో లేక… చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి… అప్పుడే ఇలాంటి పిచ్చిపనులు చేయాలని ఆలోచన వచ్చినవారికి వెన్నులో వణుకు పుట్టాలని ఆలోచించారో ఏమో కానీ… అయ్యన్నపై నిర్భయ చట్టాన్ని ప్రయోగించారు పోలీసులు. తద్వారా… పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే ఊరుకోవడానికి ఇది గత ప్రభుత్వం కాదు జగన్ ప్రభుత్వం అని సంకేతాలు ఇచ్చినట్లయ్యిందని, ఇకపై మహిళా అధికారుల విషయంలో రాజకీయ నాయకులు కాస్త ఒళ్లు దగ్గరపెట్టుకుని ప్రవర్తిస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు!