తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ కి ప్రత్యేక హోదా కేటాయించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తా అనే ప్రకటనను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ…తెలంగాణ సీఎం కేసీఆర్ పక్క రాష్ట్రమైనా ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రధానికి లేఖ రాస్తానని అన్నారు. దీంతో ఆయన చేసిన ప్రకటనను ఆహ్వానించాల్సింది పోయి దానిని కూడా చంద్రబాబు రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కలసి కట్టుగా పోరాడి కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకురావొచ్చన్నారు.’ ఏపీ ప్రభుత్వం తిత్లీ బాధిల్ని ఆదుకోవడంలో విఫలమవ్వడంతో పాటు… రూ.3450కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి లేఖ రాసిన బాబు.. రూ.500 కోట్లు మాత్రమే బాధితులకు చెల్లించడాన్ని జగన్ తప్పుబట్టారు. బాధితులకు వచ్చే నష్టపరిహారం కూడా దోచుకుంటున్నారని.. టీడీపీ ప్రభుత్వం తీరు శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా ఉందన్నారు.
వైసీపీ అధికారంలోకి రాగానే తిత్లీ బాధితులను ఆదుకుంటామని జగన్ భరోసా ఇచ్చారు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, ఇరతర ప్రాంతాల్లో కిడ్నీబాధితులకు నాడు చంద్రబాబు చేసిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏమి జరగకపోయినా…ఏదో జరుగుతోందంటూ… అమరావతి, పోలవరం పేర్లతో గ్రాఫీక్స్ లో సినిమాలు చూపిస్తున్నారన్నారు.