యమధర్మ రాజు దేవాలయం ఎక్కడుందో తెలుసా ?

-

శివాలయం, వేంకటేశ్వర ఆలయం, గణపతి, అమ్మవారు ఇలా… నిత్యం మనం అనేక దేవుళ్లను పూజిస్తాం.. ఆయా దేవాలయాలకు వెళ్తాం. అయితే సాక్షాత్తు మన ప్రాణాలను హరిస్తాడు అని నమ్మే యమధర్మరాజుకి కూడా ఎంతో భక్తితో పూజలు చేసే గుడి ఉంది అంటే ఆశ్చర్చం కలుగుతుంది కదా.. కానీ ఇది నిజం. ఆ దేవాలయం తెలంగాణలోనే ఉంది. ఆ దేవాలయ వివరాలు తెలుసుకుందాం… కరీంనగర్ జిల్లా జగిత్యాల దగ్గర ఉన్న ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో ఉంది ఈ గుడి. తమ జాతకాలు బాలేవని, ఏం చేసిన కలిసి రావట్లేదని, లేదా జాతకం ప్రకారం ప్రమాదాలు జరిగే సమయమని, మానసిక ప్రశాంతత కరువయిందని ఇలా రకరకాల సమస్యలతో బాధపడే వారు ఈ ఆలయం లోని యముని దర్శిస్తే ఆ సమస్యల నుంచి ఊరట లభిస్తుంది అని భక్తుల నమ్మకం.

అలాగే శని గ్రహ దోషాలు, జాతక దోషాలు వున్న వారు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటే ఆ భాధలు నుంచి ఉపశమనం లభిస్తుందిట. ఇక్కడ మండపంలో గల గండ దీపంలో నూనె పోసి యముని విగ్రహానికి దణ్ణం పెట్టుకుంటే గండాలన్ని తొలగిపోతాయి అని కూడా భక్తుల నమ్మకం. ప్రతి నెల భరణి నక్షత్రం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యి పూజలు నిర్వహిస్తారు ఇక్కడ . అంతేకాదు దీపావళికి రెండు రోజుల తరువాత వచ్చే ‘యమ ద్వితీయ’ రోజున యముడు తన చెల్లి అయిన యమునాదేవి ఇంటికి భోజనానికి వెళ్లి,తిరిగి యమలోకం వెళ్ళే ముందు ఈ రోజు ఎవరైతే తమ తోబుట్టువుల చేతి భోజనం తింటారో వారికి నరక బాధలు ఉండవని వరమిస్తాడని ప్రతీతి. ఆ రోజున ఇక్కడ యమునికి విశేష పూజలు నిర్వహిస్తారు.

యముని దర్శించే వారు ముందుగా గోదావరీ నదిలో స్నానం చేసి, యమునికి పూజలు నిర్వహిస్తారు. ఇలా పేరు తలచుకోవటానికే భయపడే యముని అనుగ్రహం కోసం పూజలు నిర్వహించటం విశేషం గా చెప్పుకోవచ్చు. పదిహేను వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గుడికి కార్తికంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మార్కండేయుడికి, మహా పతివ్రత సావిత్రికే యముడు వరాలు ఇచ్చాడు అని మనం పురాణాలలో తెలుసుకున్నాం. అంతేకాదు ఆయన్ను నమ్మి భక్తితో అర్చించిన వారికి ఆయన తప్పక వరాలు ఇస్తారని ప్రతీతి. అయితే ఆయన ధర్మం, సత్యం పాటించేవారంటే ఆయనకు మహాప్రీతి అంతేకాదు భగవంతుడి భక్తుడు అయితే మరీ ప్రీతి యముడికి వారి జోలికి ఆయన రాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version