సూడాన్​లో ఘర్షణలు.. జైశంకర్, సిద్ధ రామయ్య ట్విటర్ వార్‌

-

ఆఫ్రికా దేశం సూడాన్‌లో భద్రతా బలగాల మధ్య గత కొద్దిరోజులుగా తీవ్ర ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆ దేశంలోని పలు ఉద్రిక్త ప్రాంతాల్లో 31 మంది కర్ణాటక వాసులు చిక్కుకుపోయారు. ఈ అంశంపై ఇప్పుడు విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్‌, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మధ్య ట్విటర్ వార్‌ జరుగుతోంది.

‘సూడాన్‌లో చిక్కుకున్న కర్ణాటక వాసులు హక్కీపిక్కీ గిరిజన తెగకు చెందినవారు. కొద్దిరోజులుగా తిండిలేక అలమటిస్తున్న వారిని ఆదుకోవాలి. వారిని వెనక్కి రప్పించే చర్యలను ప్రభుత్వం ఇంకా ప్రారంభించలేదు’ అని ప్రధాని మోదీ, విదేశీ మంత్రిత్వ శాఖను ఉద్దేశించి సిద్ధరామయ్య ట్వీట్ చేశారు.

దీనికి జై శంకర్ కాస్త ఘాటుగా బదులిచ్చారు. ‘ఈ పరిస్థితిని రాజకీయం చేయడం పూర్తిగా బాధ్యతారాహిత్యం. మీ ట్వీట్ చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను. వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఈ సమయంలో రాజకీయాలు చేయకండి’ అని విమర్శించారు. అలాగే భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ చిక్కుకున్నవారి వివరాలు బయటపెట్టలేమన్నారు. ఈ విషయంపై అక్కడి దౌత్యకార్యాలయం మాకు ఎప్పటికప్పుడు వివరాలు అందజేస్తోందని తెలియజేశారు.

కేంద్రమంత్రి సమాధానంపై సిద్ధూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘మీరు విదేశాంగ మంత్రి కావడం వల్ల సహాయం కోసం మీకు అభ్యర్థన చేశాను. మీరు ఆందోళన చెందడంలో బిజీగా ఉంటే.. మా ప్రజలను తిరిగి వెనక్కి రప్పించగలిగే తగిన వ్యక్తిని మాకు చూపించండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version