ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై ప్రతిపక్షాలు గుప్పుమంటున్నాయి. కుమారుడు చనిపోతే వచ్చిన పరిహారంలో వాటా అడిగారని మంత్రిపై ఓ మహిళ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బాధితులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జనసేన నేతలు.. ఈ వ్యవహారంలో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.
ఈ నేపథ్యంలోనే మంత్రి అంబటి రాంబాబు రాజీనామా చేయాలంటూ సత్తెనపల్లిలో జనసేన పార్టీ ఆందోళన చేపట్టింది. మృతులకు ఇచ్చే పరిహారంలో వాటాలు అడిగిన అంబటికి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని జనసేన నేతలు స్పష్టం చేశారు. అధికారులైనా స్పందించి అనిల్ తల్లిదండ్రులకు పరిహారం చెక్కు అందించాలని డిమాండ్ చేశారు. సత్తెనపల్లిలోని జనసేన కార్యాలయం నుంచి రెవెన్యూ డివిజినల్ కార్యాలయం వరకు బాధిత కుటుంబ సభ్యులతో కలిసి జనసేన నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు.
అవినీతి నిరూపిస్తే ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న మంత్రి ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని ఎద్దేవా చేశారు. రేపల్లె నుంచి పారిపోయి సత్తెనపల్లి వచ్చిన అంబటి మళ్లీ ఇప్పుడు ఎక్కడికి పారిపోయారని అన్నారు. బాధితులకు రూ.5లక్షల పరిహారం అందించే వరకు జనసేన పార్టీ పోరాడుతుందని నేతలు స్పష్టం చేశారు.