బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణను నేడు జనసేన నేతలు కలిశారు. శుక్రవారం గుంటూరులోని కన్నా నివాసంలో జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జనసేన నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరు పార్టీలు సఖ్యతతో కలసి పనిచేద్దామని నేతలు సూచించుకున్నారు. ఆయనతో భేటీ ముగిసిన అనంతరం శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ… ఇరు పార్టీల మధ్య పొత్తు ఏర్పడడం శుభ పరిణామంగా భావిస్తున్నామని తెలిపారు.
ఏపీ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే వైసీపీ పరిపాలన సాగించాలని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. లేదంటే సర్కారుపై తాము ఒత్తిడి తెస్తామని, రానున్న రోజుల్లో బీజేపీతో కలిసి సమస్యలపై పోరాడతామని చెప్పారు. టీడీపీ, వైసీపీలకు సమాన దూరంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సంస్థల ఎన్నికల్లో తాము సత్తా చాటుతామన్నారు.