టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిలు పూర్తిగా ఏపీ రాజకీయాలకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు నేతలు తెలంగాణలో రాజకీయాలు చేయడం ఆపేశారు. మొదట జగన్ తెలంగాణలో జెండా ఎత్తేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తెలంగాణలో కూడా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో 3 అసెంబ్లీ, ఒక ఎంపీ సీటు సైతం గెలుచుకున్నారు.
గత ఎన్నికల్లో ఏపీలో కూడా చంద్రబాబు అధికారం కోల్పోవడంతో, తెలంగాణ గురించి పట్టించుకోవడం మానేశారు. పూర్తిగా ఏపీపై దృష్టి పెట్టి ముందుకెళుతున్నారు. ఏదో మొక్కుబడిగా మాత్రం తెలంగాణలో పార్టీని నడిపిస్తున్నారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అయితే మొదటి నుంచి తెలంగాణలో రాజకీయం చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇంతవరకు పోటీలో కూడా దిగలేదు. అసలు తెలంగాణలో జనసేనకు నాయకులు కూడా లేరు. పవన్ ఎంతసేపు ఏపీపైనే ఫోకస్ చేసి, అక్కడే రాజకీయాలు చేస్తున్నారు.
దీని బట్టి చూస్తే పవన్ కూడా తెలంగాణలో రాజకీయం చేయరని అర్ధమైపోతుంది. ఏదో స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున కొందరు పోటీ చేసారంతే. అసెంబ్లీ గానీ, పార్లమెంట్ ఎన్నికల్లో గానీ పవన్ పోటీ చేయలేదు. భవిష్యత్‌లో కూడా పోటీ చేసే అవకాశాలు కూడా కనిపించడం లేదు. కాబట్టి పవన్ కూడా తెలంగాణలో రాజకీయాలు చేయడం కష్టమని తెలుస్తోంది. అంటే బాబు, జగన్, పవన్‌లు ఏపీ రాజకీయాలకే పరిమితం కానున్నారు.